: మీరెందుకు వెనుకబడ్డారు? పఠాన్ కోట్ దాడిలో రెండో ఉగ్ర బృందానికి 'మాస్టర్ మైండ్' ప్రశ్న!
తమను పంపిన పాక్ లోని 'మాస్టర్ మైండ్'తో పఠాన్ కోట్ పై దాడి చేసిన ఉగ్రవాదులు మాట్లాడిన మరో ఫోన్ రికార్డును నిఘా వర్గాలు ట్రేస్ చేశాయి. మొత్తం ఆరుగురికన్నా అధికంగా భారత్ లోకి చొరబడిన ఉగ్రవాద ముఠా, అక్కడి నుంచి రెండు బృందాలుగా విడిపోయి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ప్రవేశించినట్టు అధికారులు కనుగొన్నారు. ఆపై ఓ ఉగ్రవాది పాకిస్థాన్ లోని గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేయగా, ఒక టీమ్ పఠాన్ కోట్ లోకి చేరుకున్న తరువాత, రెండో టీమ్ ఆలస్యంగా ప్రవేశించడానికి కారణాన్ని ఓ వ్యక్తి అడిగాడు. మీరెందుకు వెనుకబడ్డారని ప్రశ్నించాడు. కాగా, ప్రస్తుతం కనీసం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఎయిర్ బేస్ లోని ఉద్యోగుల నివాసాల్లో నక్కి ఉన్నారని, ఉద్యోగుల కుటుంబాలన్నీ క్షేమంగానే ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. కొద్ది సేపటి క్రితం ఎయిర్ బేస్ లోపల పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మిగిలివున్న ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భద్రతాదళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.