: ఇక బ్రిటన్ వంతు!... తాజా వీడియోలో ఐఎస్ ముష్కరుల హెచ్చరికలు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ఇప్పటికే ఇరాక్, సిరియాల్లో మారణ హోమం సృష్టించారు. వారి దారుణాలు ఆ దేశాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పైనా విరుచుకుపడ్డ సదరు ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. తాజాగా ఐఎస్ విడుదల చేసిన ఓ వీడియో కలకలం రేపుతోంది. తమ తదుపరి లక్ష్యం బ్రిటన్ అని సదరు వీడియోలో ఐఎస్ ఉగ్రవాది ఒకడు హెచ్చరించాడు. బ్రిటన్ పై దాడులు చేసేందుకు ఆ ఉగ్రవాది కారణాలు కూడా చెప్పాడు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ గత నెలలో చేసిన ఓ ప్రసంగంలో... సిరియాలో ఐఎస్ పై దాడులు చేయాల్సిన బాధ్యత బ్రిటన్ పై ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరాక్ లో ఐఎస్ పై దాడులు చేస్తున్న తాము, ఇకపై సిరియాలోనూ దాడులు మొదలుపెట్టాల్సి ఉందని తెలిపారు. బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలను ప్రస్తావించిన ఐఎస్ ఉగ్రవాది, ఆయనను ఓ ‘ఫూల్’గా అభివర్ణించాడు. బ్రిటన్ తరఫున తమపై గూఢచర్యానికి పాల్పడ్డ ఐదుగురి తలలు నరికేసిన ఆ ఉగ్రవాది సదరు దృశ్యాలను వీడియో తీసి, అందులోనే బ్రిటన్ పై దాడులు చేయనున్నట్లు ప్రకటించాడు.