: అప్ఘన్ లో భారత రాయబార కార్యాలయంపై ‘ఉగ్ర’దాడి... తిప్పికొట్టిన ఐటీబీపీ సైనికులు
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై మూడు రోజుల క్రితం విరుచుకుపడ్డ ఉగ్రవాదులు ఇంకా తోక ముడవనే లేదు, అప్పుడే అఫ్ఘనిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాద దాడి జరిగింది. అయితే క్షణాల్లో అప్రమత్తమైన ఇండియన్ టిబెల్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సైనికులు ఈ దాడిని తిప్పికొట్టారు. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అఫ్ఘన్ నగరం మజర్-ఈ-షరీఫ్ లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలోకి చొచ్చుకువచ్చిన ఉగ్రవాదులు గ్రనేడ్లను విసిరారు. ఆ తర్వాత అత్యాధునిక తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. వెనువెంటనే రంగంలోకి దిగిన ఐటీబీపీ సిబ్బంది ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా, కొంతసేపు ఉగ్ర మూక నుంచి కాల్పులు నిలిచిపోయాయి. రాయబార కార్యాలయంలో ఉన్న పెళ్లి మంటపం సమీపంలోకి దూసుకువచ్చిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరు సహచరులను కోల్పోయిన ఉగ్రవాదులు అక్కడ పార్క్ చేసి ఉంచిన ఓ కారును రక్షణ కవచంలా చేసుకుని మళ్లీ కాల్పులు ప్రారంభించారు. అప్పటికే సమాచారం అందుకున్న అఫ్ఘన్ పోలీసులు కూడా ఐటీబీపీ పోలీసులకు సహాయంగా అక్కడికి చేరుకున్నాయి. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటనలో భారత రాయబార కార్యాలయ సిబ్బందిలో ఏ ఒక్కరికీ ఏమీ కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని భారత్ కు చెందిన ఓ అధికారి చెప్పారు.