: ఉగ్రవాదులకు ట్యాక్సీ బుక్ చేసింది ‘పాక్’ ఫోన్ నంబరుతోనే!
పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఉన్న వైమానిక ఎయిర్ బేస్ పై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం ట్యాక్సీ బుక్ చేసింది పాకిస్థాన్ మొబైల్ నంబరుతోనేనన్న విషయం తాజాగా తెలిసింది. ఈ దాడికి రూపకల్పన చేసిన పాకిస్థాన్ సూత్రధారులతో సదరు ఉగ్రవాదులు నిత్యం ఫోన్ లో సంభాషిస్తూ ఉండేవారిని, పాక్ మొబైల్ నంబరు నుంచి ఫోన్ చేసి వారి కోసం ఒక ట్యాక్సీని కూడా బుక్ చేశారని భద్రతా వర్గాల సమాచారం. ఉగ్రవాదులు మొదట టొయటో ఇన్నోవా కారును వినియోగించారు. ఈ కారు బుక్ చేయడానికి ముందు దాని డ్రైవర్ కు పాక్ మొబైల్ ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఈ నంబరు పాకిస్థాన్ ది అని డ్రైవర్ కు తెలియదా? లేకపోతే అతనికి కూడా ‘ఉగ్ర’ సంబంధాలేమన్నా ఉన్నాయా? అనే విషయమై కూడా ఆరా తీస్తున్నారు. కాగా, తమను పఠాన్ కోట్ లోని ఒక కీలక ప్రదేశంలో దించాలని ఉగ్రవాదులు టొయోటా కారు డ్రైవర్ కు చెప్పారు. అయితే, కొంతదూరం వెళ్లాక వాహనం చెడిపోయింది. దీంతో ఎస్పీకి చెందిన వాహనాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అందులోని ఎస్పీని, ఆయన వంటవాడిని చితకబాది వదిలేశారు. వాళ్లతో పాటు ఉన్న మరో నగల వ్యాపారిని బందీగా పట్టుకున్న ఉగ్రవాదులు ఆయన్ని కొంత దూరం తీసుకువెళ్లి.. సదరు వ్యాపారి గొంతు కోసి వదిలేశారు. వ్యాపారి ఫోన్ ను దొంగిలించి పాక్ లోని సూత్రధారులకు ఫోన్ చేశారు. ఒక ఉగ్రవాది తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. కారు డ్రైవర్ కు పాక్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ నంబరు, వ్యాపారి ఫోన్ లో నుంచి ఉగ్రవాదులు పాకిస్థాన్ సూత్రధారులకు చేసిన నంబర్ ఒక్కటేనని భద్రతా దళాల సమాచారం.