: నల్లగొండ జిల్లాలో కారు బీభత్సం... వృద్ధుడిని ఢీకొట్టి, టాప్ పై డెడ్ బాడీతో 20 కి.మీ ప్రయాణించిన కారు
నల్లగొండ జిల్లా పరిధిలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న ఓ ఘటన పెను కలకలం రేపింది. జిల్లాలోని అయిటిపాముల సమీపంలో వేగంగా దూసుకెళుతున్న ఓ చిన్న కారుపై వృద్ధుడి డెడ్ బాడీని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వెంటనే తేరుకుని వేగంగా వెళుతున్న సదరు కారును ఎలాగోలా ఆపగలిగారు. కారు దిగిన డ్రైవర్ అసలు తన కారుపైకి వృద్ధుడి డెడ్ బాడీ ఎలా వచ్చిందో తెలియనట్లే నటించాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం కాస్తంత అటూ ఇటూగా వెల్లడైంది. చిట్యాల మండలం పంతంగి వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఆ దెబ్బకు వృద్ధుడు అంతెత్తున ఎగిరి కారు టాప్ పై పడిపోయాడు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. కారు టాప్ పై పడిన ఆ వృద్ధుడి డెడ్ బాడీని డ్రైవర్ గమనించినా, భయంతో కారును ఆపకుండా మరింత వేగం పెంచాడు. అయిటిపాముల వద్దకు వచ్చేసరికి కారు టాప్ పై వృద్ధుడి డెడ్ బాడీని గమనించిన స్థానికులు కారును ఎలాగోలా అపేశారు. దీంతో ఆ డ్రైవర్ కారు దిగక తప్పలేదు. తన కారు టాప్ పై పడిపోయిన వృద్ధుడి డెడ్ బాడీని చూసిన అతడి మైండ్ బ్లాక్ అయిపోయింది. అతడి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు. కారుతో పాటు వృద్ధుడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు.