: భారత్-పాక్ చర్చలకు విఘాతమే లక్ష్యంగా ‘ఉగ్ర’దాడి


ముంబై మారణ హోమం తర్వాత భారత్-పాకిస్థాన్ ల మధ్య ఎలాంటి చర్చలకూ అవకాశం లేకుండా పోయింది. నిత్యం ఇరు దేశాల సైనికుల మధ్య సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఉగ్రవాదంపై రాజీ లేని పోరు సాగిస్తామని ఏడాదిన్నర క్రితం భారత్ లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అదే సమయంలో పొరుగు దేశాలతో విభేదాలు అంత మంచిది కాదన్న వాస్తవాన్ని కూడా ఆయన ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే మోదీ పాక్ కు స్నేహ హస్తం అందించారు. మొన్నటి వాతావరణ సదస్సులో భాగంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఆత్మీయ ఆలింగనంతో పాటు అరమరికలు లేని చర్చలు జరిపారు. వెనువెంటనే ఇరు దేశాల మధ్య వివిధ స్థాయుల్లో చర్చలకు తెర లేచింది. రోజుల వ్యవధిలోనే ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు బ్యాంకాక్ లో భేటీ అయ్యారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ రాజధాని ఇస్లామాబాదులో రెండు రోజుల పాటు పర్యటించారు. వీటన్నిటినీ తలదన్నేలా నేరుగా నరేంద్ర మోదీనే గంటల ముందు సంచలన నిర్ణయం తీసుకుని పాక్ నగరం లాహోర్ శివారులోని నవాజ్ షరీఫ్ ఇంటిలో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. ఈ నెల 15న ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల మధ్య చర్చలు జరిగేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడటం ఈ చర్చలపై పెను ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. ఉగ్రవాదుల అసలు లక్ష్యం కూడా అదేనని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భారత్-పాక్ ల మధ్య ఎప్పుడు చర్చలకు తెరలేచినా, ఉగ్రవాదులు పేట్రేగిపోవడం మనకు కొత్తేమీ కాదు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య బలీయమవుతున్న సంబంధాలను దెబ్బతీయాలన్న కుట్రతోనే ఉగ్రవాదులు నేటి దాడికి పథక రచన చేశారని ఇట్టే చెప్పేయొచ్చు. మరి ఈ దాడులు చర్చలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

  • Loading...

More Telugu News