: నడి రోడ్డుపై తల... రైల్వే గేటు వద్ద మొండెం... తీవ్ర భయాందోళనలో యలమంచిలి వాసులు
విశాఖపట్నం జిల్లా యలమంచిలి వాసులు నేటి ఉదయం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీ సమీపంలోని రోడ్డుపై ఓ తల పడి ఉండటాన్ని నేటి ఉదయం చూసిన స్థానికులు పరుగులు పెట్టారు. వెనువెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు మరికాసేపట్లోనే రైల్వే గేటు సమీపంలో తల లేని మొండెం పడి ఉందన్న సమాచారం వచ్చింది. రెండు ప్రాంతాలకు వెళ్లిన పోలీసులు రోడ్డుపై పడ్డ తల, రైల్వే గేటు వద్ద పడి ఉన్న మొండేనికి చెందినదై ఉంటుందని దాదాపుగా తేల్చేశారు. సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నా, మొండెం నుంచి తల వేరైన వైనం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఉన్న గుట్టును విప్పేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.