: జైషే మొహ్మద్ ముష్కరుల దుశ్చర్యే... ఎస్పీ సెల్ ఫోన్ నుంచి పాకిస్థాన్ కు 4 సార్లు ఫోన్
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై నేటి తెల్లవారుజామున జరిగిన దాడి జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరుల పనేనని దాదాపుగా తేలిపోయింది. గతంలో పార్లమెంటుపై దాడి చేసిన దుర్మార్గులు కూడా ఈ సంస్థకు చెందినవారే. పఠాన్ కోట్ దాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన ఐబీ, ఎన్ఐఏ అధికారులు ఈ మేరకు ఆధారాలను సేకరించినట్లు సమాచారం. నిన్న పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్ ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ఆయన కారుతో పాటు సెల్ ఫోన్ ను కూడా అపహరించారు. సదరు ఫోన్ నుంచి ముష్కరులు నాలుగు సార్లు పాకిస్థాన్ లోని తమ బాసులతో మాట్లాడారు. ఎస్పీ సెల్ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ డేటాను పరిశీలించిన పోలీసులు ఈ మేరకు వివరాలు సేకరించారు. తమ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకునేందుకు ప్రభుత్వ వాహనాలను వినియోగించిన ఉగ్రవాదులు, సైనిక దుస్తుల్లో సంచరించారు.