: అశోక్ ఖేమ్కాకు ప్రమోషన్!... న్యూఇయర్ నాడు హర్యానా సర్కారు తీపి కబురు
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా వివాదాస్పద భూముల క్రమబద్ధీకరణను రద్దు చేసి దేశంలోనే సత్తా కలిగిన ఐఏఎస్ అధికారిగా వినుతికెక్కిన సీనియర్ బ్యూరోక్రాట్ అశోక్ ఖేమ్కా గుర్తున్నారుగా. నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే వెలుగుచూసిన ఈ వ్యవహారంతో అశోక్ ఖేమ్కాను హర్యానాలోని నాటి భూపిందర్ సింగ్ హుడా (కాంగ్రెస్) ప్రభుత్వం బదిలీల పేరిట ముప్పు తిప్పలు పెట్టింది. ఒకానొక సమయంలో ఖేమ్కాకు అసలు పోస్టింగే ఇవ్వలేదు. అయితే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడం, హర్యానాలోనూ బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరడం... తదితర కీలక పరిణామాల నేపథ్యంలో ఖేమ్కాకు ఊరట కలిగింది. తాజాగా నిన్న న్యూఇయర్ నాడు ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమోషన్ వార్త తెలుసుకున్న ఖేమ్కా సంతోషానికి అవధులే లేవు. ముఖ్య కార్యదర్శిగా కొత్త పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నానంటూ ఆయన ట్విట్టర్ లో కామెంట్ చేశారు.