: టీడీపీ అభివృద్ధి ఫలాలనే టీఆర్ఎస్ అనుభవిస్తోంది: నన్నూరి నర్సిరెడ్డి
తెలంగాణ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై మండిపడుతున్నారు. కొద్దిసేపటి కిందటే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వీరిపైనే మాట్లాడగా, ఇప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం సైబరాబాద్ ను ఏర్పాటు చేసిందనే విషయాన్ని మంత్రి కేటీఆర్ మరచినా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. ఆయన నిర్వహించే పారిశ్రామిక సదస్సు, అంతర్జాతీయ ఐటీ సదస్సులన్నీ తమ అధినేత చంద్రబాబు కట్టిన హైటెక్ సీటీలోనే అన్న సంగతి మర్చిపోయారా? అని నన్నూరి మీడియా సమావేశంలో ప్రశ్నించారు. హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారో కేటీఆర్ కు తెలియకుంటే మీ నాన్న(కేసీఆర్)ని అడిగి తెలుసుకోవాలని సూచించారు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టుగా... టీడీపీ హాయంలో అభివృద్ధి చేసిన ఫలాలనే ప్రస్తుతం అనుభవిస్తూ కేటీఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.