: యుద్ధానికే కేజ్రీ మొగ్గు!... సెలవులోనే ఉండిపొమ్మని ‘డానిక్స్’ ఆఫీసర్లకు సూచన
దేశ రాజధాని హస్తినకు సంబంధించిన పాలన వ్యవహారాల్లో మరోమారు కేంద్రంతో యుద్ధానికే సై అంటున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తన కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయని ఇద్దరు డానిక్స్ (ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐల్యాండ్స్ సివిల్ సర్వీస్) అధికారులను సస్పెండ్ చేస్తూ కేజ్రీ తీసుకున్న నిర్ణయంపై మొన్న అధికారులు భగ్గుమన్నారు. సర్కారు నిర్ణయానికి నిరసనగా నిన్న ఏకంగా 200 మందికి పైగా డానిక్స్ అధికారులు సామూహిక సెలవు పెట్టారు. దీనిపై నిన్న సాయంత్రం ఘాటుగా స్పందించిన కేజ్రీవాల్... ‘మీరు సెలవులో వెళ్లడం సంతోషం, సెలవులోనే కొనసాగండి’ అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న డానిక్స్ అధికారులు సెలవులో వెళితే తామేమీ భయపడేది లేదని చెప్పిన కేజ్రీవాల్, ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని పాలన సాగించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పైనా కేజ్రీ నిప్పులు చెరిగారు. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి... సర్కారుకు వ్యతిరేకంగా డానిక్స్ అధికారులు నిర్వహించిన సమావేశానికి ఎలా హాజరవుతారని ఆయన ప్రశ్నించారు. డానిక్స్ అధికారుల సామూహిక సెలవుతో కాస్తంత దిగివస్తారనుకున్న కేజ్రీ, వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసి కేంద్రంపై మరోమారు యుద్ధానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.