: కాల్ మనీ నిందితుడు సత్యానందం అరెస్ట్... బెయిల్ తర్వాత బాధితుడి ఫిర్యాదే కారణం
ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారంలో నిన్న రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ట్రాన్స్ కో అధికారి సత్యానందం అరెస్టయ్యారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన సత్యానందం నిన్న హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం విజయవాడలోని స్థానిక కోర్టులో లొంగిపోయి పూచీకత్తులు సమర్పించి తన లాయర్లతో ఆయన దర్జాగా కోర్టు నుంచి బయటకు వచ్చారు. అయితే ఇబ్రహీంపట్నానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి నిన్న సాయంత్రం సత్యానందంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు సత్యానందాన్ని అరెస్ట్ చేశారు.