: పవన్, మహేశ్ ఫ్లెక్సీల వద్ద షార్ట్ సర్క్యూట్... తూ.గో.జిలో 5 మంది దుర్మరణం


కొత్త సంవత్సరాది వేడుకల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో నిన్న రాత్రి రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్... పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబుల ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు చనిపోయారు. పది మంది దాకా గాయపడ్డారు. వివరాల్లోకెళితే... జిల్లాలోని రంగంపేట మడలం వడిసలేరులో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ అభిమానులు ఇద్దరు చనిపోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలోనూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే జిల్లాలోని మండపేట మండలం మారేడుపాకలో మహేశ్ బాబుకు చెందిన 20 అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసే క్రమంలో రాత్రి ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. న్యూ ఇయర్ నాడు తమ అభిమాన తారల ఫ్లెక్సీలు కడుతుండగా మొత్తం ఐదుగురు చనిపోవడం జిల్లాలో విషాదాన్ని నింపింది.

  • Loading...

More Telugu News