: ‘బాహుబలి’ హవా కంటిన్యూస్!... ఫేస్ బుక్ టాప్ టాపిక్స్ లో నాలుగో స్థానం కైవసం
భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన తెలుగు చిత్రరాజం ‘బాహుబలి’ హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే వసూళ్లలో దేశీయ సినీ రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టేసింది. దేశంలోని అన్ని భాషా చిత్రాల్లోనూ బాహుబలి ఓ కొత్త చర్చకు తెరతీసింది. భారీతనంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల మేర వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఈ చిత్రం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రికార్డ్స్ లోనూ చోటు సాధించింది. ఫేస్ బుక్ టాప్ టాపిక్స్-2015లో ఈ చిత్రం ఏకంగా నాలుగో స్థానాన్ని చేజిక్కించుకుంది. టాప్ టాపిక్స్ లో తొలి స్థానం ప్రధాని నరేంద్ర మోదీ నిలవగా, రెండో స్థానంలో ’ఈ-కామర్స్ బూమ్’ నిబబడింది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మూడో స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాన్ని దక్కించుకున్న ‘బాహుబలి’ తెలుగు చిత్రసీమ టాలీవుడ్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది. గతేడాది జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అటు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే కాక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా ఇంటర్నేషనల్ స్థాయి గుర్తింపును తీసుకొచ్చింది.