: ఇద్దరు ప్రధానులు తమ తల్లుల సమక్షంలో చర్చించాలి: ప్రముఖ కవి మునావర్ రాణా!
భారత్ - పాక్ ప్రధానులిద్దరూ తమ తల్లుల సమక్షంలో చర్చలు జరిపితే కనుక రెండు దేశాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఉర్దూకవి మునావర్ రాణా అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ దేశాలు రెండు అన్నదమ్ముల్లాంటివని అన్నారు. తల్లుల సమక్షంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇటీవల పాక్ వెళ్లివచ్చిన మోదీ, షరీఫ్ తల్లి పాదాలకు నమస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. అన్నగా మోదీ తన బాధ్యత నిర్వర్తించారని, ఇక చొరవ తీసుకోవాల్సింది షరీఫే అని రాణా అన్నారు. కాగా, ఇటీవల దేశంలో చోటుచేసుకున్న ‘అసహనం’ సంఘటనలపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఆయన తిరిగి ఇచ్చివేసిన సంఘటన విదితమే.