: ‘గోవా’ సర్కార్ నిర్ణయంతో కొబ్బరిచెట్లు అంతరించే ప్రమాదం!


గోవా... రమ్యమైన బీచ్ లు, అందమైన కొబ్బరిచెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి ఎక్కువగా విచ్చేస్తుంటారు. అక్కడ బారులుతీరి ఉండే కొబ్బరిచెట్లు ఎంతగా ఆనందపరుస్తాయో వేరే చెప్పనక్కర్లేదు. అయితే, గోవా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఇక్కడి కొబ్బరిచెట్ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇకపై గోవాలో కొబ్బరి చెట్లను నరికివేయాలంటే ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై పర్యావరణవేత్తలు, నిపుణులు, ఉద్యమకారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. కొబ్బరిచెట్టు.. చెట్టు కాదా? అది గడ్డితో సమానమా? అంటూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు క్లాడ్ ఆల్వరెస్ ప్రశ్నిస్తున్నారు. కొబ్బరితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అది తెలియని విషయం కాదని అన్నారు. గోవా వంటకాల్లో కొబ్బరినూనెనే ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు. అక్కడి లోకల్ మద్యం ఫెన్నీలో కూడా ఈ నూనెనే వినియోగిస్తున్నారని చెప్పారు. కొబ్బరి చెట్టును ‘చెట్టు’ జాబితా నుంచి తొలగించడం సబబు కాదని, భవిష్యత్తులో ఈ చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆల్వరెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గోవాలోని ప్రభుత్వ స్థలమే కాకుండా ప్రైవేటు స్థలాల్లో ఉన్న ఏ చెట్టును కొట్టివేయాలన్న 1984 నాటి గోవా, డయ్యూ, డామన్ చెట్ల పరిరక్షణ చట్టం కింద అటవీ శాఖాధికారులు అనుమతి తీసుకోవాలి. ఈ చట్టంలో ఉన్న చెట్ల నుంచి ఇప్పుడు కొబ్బరిచెట్టును తొలగిస్తున్నారు. 2008వ సంవత్సరంలో ఈ చెట్టును ఆ జాబితాలో చేర్చారు. ఇప్పుడేమో, చెట్ల నిర్వచనం కిందకు కొబ్బరిచెట్టు రాదంటూ ప్రభుత్వం దానిని తొలగించింది. చట్టంలో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఒక చెట్టు మొదలు ఐదు సెంటీమీటర్ల వ్యాసంతోపాటు 30 సెంటీ మీటర్ల పొడవుండాలి. ఆ చట్టం నుంచి కొబ్బరిచెట్టును తొలగించేందుకుగాను కేబినెట్ ఈ నిర్వచనాన్ని కూడా మార్చివేసింది. పది సెంటీమీటర్ల వ్యాసం, ఒక మీటరు పొడవు ఉండాలంటూ కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చింది. అయితే, ఆ చట్టం నుంచి కొబ్బరిచెట్లను తొలగించడం వెనుక ఉన్న అసలు కథేమిటంటే... గోవాలోని సంగియం తాలూకాలోని ఒక డిస్టలరీ ఏర్పాటు నిమిత్తం ‘వాణి ఆగ్రో’ అనే కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ డిస్టలరి ఏర్పాటు చేసే ప్రాంతంలో సుమారు 500 వరకు కొబ్బరిచెట్లు ఉన్నాయి. వాటిని కొట్టివేయాలంటే 1984 నాటి చట్టం అడ్డుపడుతోంది. అందుకని చట్ట సవరణ చేసి కొబ్బరిచెట్టుకు ఎసరుపెట్టారు.

  • Loading...

More Telugu News