: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రెజీనా 'పెళ్లి చూపుల' వీడియో!
సంప్రదాయ పద్ధతిని ప్రశ్నిస్తూ రూపొందించిన పెళ్లి చూపుల వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది. తమ ఉత్పత్తికి ప్రచారంగా ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రూపొందించిన ఈ వీడియోలో పెళ్లి కుమార్తెగా కథానాయిక రెజీనా నటించడం విశేషం. సాధారణంగా భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కుమారుడి తరపు బంధువులు, చూపుల కార్యక్రమం పూర్తయ్యాక 'తరువాత చెబుతా'మని చెప్పి వెళ్లిపోతుంటారు. కానీ ఈ వీడియోలో మాత్రం రివర్స్ గా వుంటుంది. అబ్బాయి తరపువారు అమ్మాయి ఇంటికి వస్తారు. దీంతో పెళ్లి కుమార్తె (పాయల్) దగ్గరకు వచ్చిన తండ్రి 'అబ్బాయి వచ్చేశాడు. తొందరగా తయారవ్వు' అంటూ తొందర పెడతాడు. దీంతో 'జస్ట్ సమోసాలు తినే సమయంలోనే అతను నచ్చాడో లేదో తెలుసుకోవడం ఎలా?' అని తండ్రిని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పకుండా ఆ తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పెళ్లి చూపుల తంతు ముగుస్తుంది. 'పాయల్ తమకు బాగా నచ్చిందని, వివాహానికి సిద్ధ'మని పెళ్ళికొడుకు తరఫు వారు చెబుతారు. దీంతో పాయల్ తండ్రి మాట్లాడుతూ, 'మా అమ్మాయి మీ అబ్బాయికి నచ్చింది. మరి మీ అబ్బాయి ఎలాంటి వాడో తెలుసుకోవాలి కదా, మేము కూడా మీ ఇంటికి వచ్చి చూసి నిర్ణయిస్తాం' అని చెబుతాడు. 'ఎందుకు?' అని వారు ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా 'మీ అబ్బాయికి ఇంటిపని, వంటపని వచ్చో లేదో తెలుసుకోవాలిగా' అంటాడు. దీనికి అబ్బాయి తల్లి 'మా వాడికి నూడుల్స్ చేయడం వచ్చు' అని గర్వంగా చెబుతుంది. అయితే 'తన కుమార్తె కేవలం నూడుల్స్ మాత్రమే తిని బతకలేదని' సమాధానమిస్తాడు. దీంతో పెళ్లి కుమారుడు కలుగజేసుకుని 'వారం రోజులు టైమిస్తే వంట నేర్చుకుంటా'నని హామీ ఇస్తాడు. కుర్రాళ్లలో వస్తున్న మార్పును కళ్లకు కట్టిన ఈ యాడ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.