: ఆంధ్రోళ్ల ఓట్లతోనే గెలుస్తాం: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ కు చెందిన సోదరులు సంక్రాంతి సెలవులకు స్వస్థలాలకు వెళ్లి వచ్చిన వచ్చిన తరువాతే గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులోని టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, తాము హైదరాబాదుకు మంచి చేశామని చెప్పారు. హైదరబాదీలకు, హైదరాబాదులో ఉన్న ఆంధ్రులకు ఎలాంటి నష్టం వాటిల్లే పనులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదులో ఉన్న ఆంధ్ర సోదరులు సంక్రాంతి పండగను ఆనందంగా నిర్వహించుకుని వచ్చిన తరువాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని, వారి మద్దతుతోనే జీహెచ్ఎంసీలో జెండా పాతుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, అంతా మంచే చేస్తున్నామని ఆయన చెప్పారు. హైదరాబాదుకు ఎంతో మేలు చేశామని, ఇంకా ఎంతో చేస్తామని చెప్పిన ఆయన తమ పనితీరే తమను గెలిపిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు వస్తే మీరు ఏం చేశారంటూ నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.