: 20 నిమిషాల్లో 120 పాయింట్లు దూకిన సెన్సెక్స్ బుల్!
యూరప్ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలతో మరో గంటలో సెషన్ ముగుస్తుందనగా వచ్చిన కొనుగోలు మద్దతు సెన్సెక్స్ బుల్ ను అమాంతం ముందుకు దూకించింది. సెషన్ ఆరంభం నుంచి క్రితం ముగింపుకు మైనస్ 10 నుంచి 50 పాయింట్ల లాభం మధ్య అటూ ఇటుగా కదలాడిన సూచిక ఆపై పైకెగసింది. మధ్యాహ్నం 2:52 గంటల సమయంలో 26,020 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్, 3:10 గంటలకు 26,140 పాయింట్లకు దుమికింది. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 157.51 పాయింట్లు పడిపోయి 0.61 శాతం లాభంతో 26,117.54 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 50.10 పాయింట్లు తగ్గి 0.63 శాతం నష్టంతో 7,946.35 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.35 శాతం, స్మాల్ క్యాప్ 0.49 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 31 కంపెనీలు లాభాల్లో నడిచాయి. హెచ్డీఎఫ్సీ, జడ్ఈఈఎల్, గెయిల్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు లాభపడగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వీఈడీఎల్, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, హీరోమోటో కార్ప్ తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 1,00,38,493 కోట్లకు చేరుకుంది. మొత్తం 2,911 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,465 కంపెనీలు లాభాలను, 1,163 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.