: ఈ ఏడాది 2,710 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశాం: ఏపీ డీజీపీ రాముడు
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జరిగిన నేరాల సంఖ్యతో బాటు, ఎంతమంది నేరస్తులు పట్టుబడ్డారన్న వివరాలను డీజీపీ జేవీ రాముడు విజయవాడలో మీడియా సమావేశంలో వెల్లడించారు. 2014తో పోలిస్తే నేరాల సంఖ్య 4.23 శాతం తగ్గిందని తెలిపారు. ఈ సంవత్సరం వంద మంది మావోయిస్టులు లొంగిపోతే, మరో 96 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు చెప్పారు. మావోలకు, పోలీసులకు మధ్య 13 సార్లు ఎదురుకాల్పులు జరిగినట్టు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 2,710 మందిని అరెస్ట్ చేశామని, వారిలో 40 మంది అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నట్టు వివరించారు. 51 మంది స్మగ్లర్లపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చశామని, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపామని పేర్కొన్నారు. ఇక అమరావతి శంకుస్థాపన, గోదావరి పుష్కరాలు, నెల్లూరులో వరద సహాయక చర్యల్లో పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసిందని డీజీపీ అభినందించారు.