: కేజ్రీకి ఎదురుదెబ్బ!... సివిల్ సర్వెంట్ల సస్పెన్షన్ ను రద్దు చేసిన కేంద్ర హోం శాఖ
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవవస్థాపక అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నేటి ఉదయం మరో షాక్ తగిలింది. సర్కారీ న్యాయవాదులకు వేతనాలు పెంచుతూ తన కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న కారణంగా ఇద్దరు సీనియర్ సివిల్ సర్వెంట్లను కేజ్రీవాల్ సస్పెండ్ చేశారు. నిన్న కేజ్రీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్లంతా గళం విప్పారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయకపోతే అందరం సామూహిక సెలవులో వెళతామంటూ 200 మంది సివిల్ సర్వెంట్లు కేజ్రీ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. అయితే అధికారుల అల్టిమేటంపై కేజ్రీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో రంగప్రవేశం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేటి ఉదయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసేసింది. అసలు ఢిల్లీ సర్కారులో పనిచేసే సివిల్ సర్వెంట్లపై సస్పెన్షన్ వేటు వేసే అధికారం కేజ్రీవాల్ ప్రభుత్వానికి లేదని కూడా సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.