: అమరావతికి కేంద్రం మరో కొర్రి!... సమగ్ర వివరాలు పంపాలంటూ కేంద్ర పర్యావరణ శాఖ శ్రీముఖం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులేస్తున్న చంద్రబాబు సర్కారుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో అడ్డంకి ఎదురైంది. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ఓ కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాజధాని నిర్మాణం కోసం అటవీ భూముల వినియోగానికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ సర్కారు ప్రతిపాదనకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అనుమతి కావాలంటే సమగ్ర వివరాలు చెప్పాల్సిందేనని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను వెనక్కు తిప్పి పంపింది. ఈ మేరకు పర్యావరణ శాఖలోని అత్యున్నత నిర్ణయాధికారమున్న పర్యావరణ సలహా మండలి పలు ప్రశ్నలతో ఏపీ సర్కారుకు లేఖ రాసింది. అమరావతి నిర్మాణానికి గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పరిసరాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతుల భూములతో పాటు 19 వేల ఎకరాల అటవీ భూములను వినియోగించుకునేందుకు ఏపీ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుల నుంచి భూములను కొనుగోలు చేసిన ప్రభుత్వం, అటవీ భూములను కూడా అప్పగించాలని కేంద్రానికి లేఖ రాసింది. రాజధాని నిర్మాణం, ప్రతిపాదిత అటవీ భూముల్లో ఎక్కడెక్కెడ ఏఏ నిర్మాణాలు కడుతున్నారన్న సమగ్ర వివరాలు పంపిస్తే కాని, అనుమతి ఇవ్వలేమని పర్యావరణ సలహా మండలి తేల్చిచెప్పింది. అంతేకాక ఏపీ ప్రతిపాదనను పలు కొర్రీలతో తిప్పి పంపింది. దీనిపై ఆంగ్ల దినపత్రిక ‘ఎకనమిక్ టైమ్స్’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది.