: ప్రధాని అధికారిక నివాసం కంటే... సోనియా గాంధీ బంగ్లానే పెద్దదట!
అవును, లోక్ సభ సభ్యురాలి హోదాలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ప్రభుత్వం కేటాయించిన 10 జన్ పథ్, ప్రధాని అదికారిక నివాసం 7 రేస్ కోర్స్ రోడ్ కంటే పెద్దదట. 10 జన్ పథ్ బంగ్లా 15,181 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంటే, 7 రేస్ కోర్స్ రోడ్ మాత్రం 14,101 చదరపు మీటర్లు మాత్రమే ఉందట. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దేవ్ ఆశిష్ భట్టాచార్య అనే వ్యక్తి దాఖలు చేసిన అభ్యర్థన మేరకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఈ వివరాలను వెల్లడించింది. రాష్ట్రపతి భవన్, ఉప రాష్ట్రపతి అధికారిక నివాసం మాత్రమే సోనియా గాంధీ బంగ్లా కంటే పెద్దవి. ఎంపీ హోదాతో సంబంధం లేకుండానే సోనియా గాంధీకి 10 జన్ పథ్ ను కేటాయించినట్లు కూడా సీపీడబ్ల్యూడీ తెలిపింది. ఇక తుగ్లక్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేటాయించిన భవంతి (12 తుగ్లక్ రోడ్) కూడా భారీ భవంతేనట. ఈ బంగ్లా 5,022 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. సోనియా కూతురు ప్రియాంకా గాందీ వాద్రాకు కేటాయించిన బంగ్లా (35 లోధీ ఎస్టేట్) 2,765 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉందని సీపీడబ్ల్యూ తెలిపింది.