: ఢిల్లీ ఎయిమ్స్ లో జమ్ము కశ్మీర్ సీఎంకు ఆక్సిజన్ థెరపీ
ఈ నెల 24న జ్వరం, ఛాతినొప్పితో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన జమ్ము కశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఈ సమయంలో ఆయనకు ఆక్సిజన్ థెరపీ అవసరమని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. వైద్య నిపుణుల బృందం పరిస్థితిని సమీక్షిస్తోందని ఎయిమ్స్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే 79 ఏళ్ల సయీద్ స్పృహలోనే ఉన్నారని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రిలో ఆయనకు తోడుగా కుమార్తె, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న(మంగళవారం) ఎయిమ్స్ కు వచ్చి సయీద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.