: సోషల్ మీడియాకు ఎక్కిన టీడీపీ, బీజేపీ వివాదం!


నిన్నటిదాకా వేదికలపైన, మీడియా సమావేశాల్లోనే కనిపించిన టీడీపీ, బీజేపీల మధ్య వివాదం తాజాగా సోషల్ మీడియాకు ఎక్కింది. ఏపీలో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ... బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి, తన ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులిప్పించుకుంది. గడచిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇరు పార్టీలు కలిసే పోటీ చేశాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం ప్రకటించాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై స్థానిక టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే, రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ వివాదం రేకెత్తినప్పుడల్లా ఎవరో ఒకరు సీనియర్ నేత తెరపైకి రావడం, దానిని చల్లబరచడం జరుగుతోంది. ఇటీవలే చంద్రబాబు సమక్షంలో భేటీ అయిన ఇరు పార్టీల నేతలు ఇకపై వాదులాడుకోకూడదని నిర్ణయించుకున్నాయి. అయితే ఆ మాట ఎంతోకాలం నిలవలేదు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో ఇరు పార్టీల మధ్య భారీ గలాటా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత బాపిరాజు... దేవాదాయ శాఖ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు సమక్షంలోనే వారిద్దరూ వాదులాడుకున్నారు. శిద్దా సర్దిచెప్పడంతో అప్పటికి ఆ వివాదం సద్దుమణిగినా, సదరు వివాదాన్ని వీడియోగా తీసిన ఓ టీడీపీ నేత దానిని ఫేస్ బుక్ లో పెట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News