: యువతిని వివస్త్రను చేసిన 11 మంది మహిళలకు రెండేళ్ల జైలు శిక్ష
ముంబైలోని సేవ్రీ సమీపంలో 22 ఏళ్ల యువతిని బలవంతంగా వీధిలోకి ఈడ్చుకొచ్చి, బట్టలు తీసి నగ్నంగా పరేడ్ చేయించిన కేసులో 11 మంది మహిళలు, ఓ పురుషుడికి రెండేళ్ల జైలుశిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ, ముంబై సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాల్లోకి వెళితే, 2010, జూన్ లో యువతి సోదరుడు ఓ నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహావేశాలకు గురైన పలువురు మహిళలు ఆమెపై దాడికి దిగారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. అప్పట్లో ఈ ఘటన ముంబైలో సంచలనం కలిగించింది. కోర్టు విచారణ దాదాపు ఐదేళ్లు సాగగా, వీరికి శిక్ష విధించేందుకు చట్టం ఒప్పదని డిఫెన్స్ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది ఘోరమైన ఘటనని, బాధితులు రెండు వైపులా ఉన్నప్పటికీ, మహిళల ప్రవర్తన సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేసిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. యువకుడి కుటుంబానికి గుణపాఠం చెప్పేందుకే వారు ఈ పని చేసి వుంటారని భావిస్తున్నా, అది సభ్య సమాజంలో దుర్మార్గమైన చర్యేనని వెల్లడించారు. ఈ కేసులో మహిళలపై ఆరోపించిన కుల ఆధారిత వేధింపుల సెక్షన్లు మాత్రం తొలగిస్తున్నట్టు తెలిపారు.