: కోమటిరెడ్డి జోస్యం నిజమైంది... నల్లగొండలో టీఆర్ఎస్ కు పరాభవం!
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హోరాహోరీగా సాగిన నల్లగొండ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. 158 ఓట్ల మెజారిటీతో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డిని చిత్తు చేశారు. దీంతో గులాబీ పార్టీకి షాక్ తగిలింది. జిల్లాలో స్థానిక సంస్థల్లో మెజారిటీ బలమున్న తాము ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకుంటామని రాజగోపాల్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తన సోదరుడు ఓటమిపాలైతే, తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని ఆయన ప్రకటించారు కూడా. వెంకటరెడ్డి చెప్పినట్లుగానే నేటి ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో ఆది నుంచి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యం సాధించారు. ఏ దశలోనూ వెనకబడని ఆయన చిన్నపరెడ్డికి షాకిస్తూ 158 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజగోపాల్ రెడ్డికి 616 ఓట్లు పడగా, చిన్నపరెడ్డి మాత్రం 458 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.