: నల్లగొండలో టీఆర్ఎస్ కు షాక్ తగలనుందా?... ఆధిక్యంలోకి దూసుకొచ్చిన కోమటిరెడ్డి
నల్లగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల ఓ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా స్థానంలో తన సోదరుడు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలైతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన ఆయన, అందుకు సిద్ధమేనా? అని అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ ను స్వీకరించేందుకు టీఆర్ఎస్ నేతలు ముందుకు రాలేదు. రెండు రోజుల క్రితం జరిగిన పోలింగుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నేటి ఉదయం ప్రారంభమైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లుగానే రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలోకి దూసుకువచ్చారు. నల్లగొండలో జరుగుతున్న కౌంటింగ్ లో తొలి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉత్కంఠభరిత వాతావరణం చోటుచేసుకుంది. మొత్తం ఆరు స్థానాలకు జరుగుతున్న కౌంటింగ్ లో ఐదు చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా, ఒక్క నల్లగొండలో మాత్రం కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తోంది.