: పైరేటెడ్ సాఫ్ట్ వేర్ వాడిన వస్త్ర తయారీ సంస్థకు రూ.66 లక్షల ఫైన్!
ఎడోబ్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థల ఉత్పత్తులకు లైసెన్స్ ఫీజు చెల్లించకుండానే ఆయా కంపెనీల సాఫ్ట్ వేర్ లను వినియోగిస్తున్న భారత్ లోని ఒక వస్త్ర తయారీ సంస్థ కు కాలిఫోర్నియా కోర్టు రూ.66 లక్షల జరిమానా విధించింది. ఈ సంఘటనకు సబంధించిన వివరాలు... మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్రతిభా సింటెక్స్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ దుస్తులను వాల్ మార్ట్ సహా పలు అగ్రశ్రేణి అమెరికన్ కంపెనీలకు ఎగుమతి చేస్తుంది. సదరు కంపెనీ వ్యాపార అలవాట్లు సక్రమంగా లేని కారణంగా కాలిఫోర్నియా లోని వస్త్ర కంపెనీలకు నష్టం వచ్చినట్లు అటార్నీ జనరల్ కమలా హారిస్ పేర్కొన్నారు. ‘ప్రతిభా’ అక్రమ వ్యాపార అలవాట్ల కారణంగా అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను తయారు చేయలేకపోతున్నాయని కాలిఫోర్నియా అటార్ని జనరల్ అన్నారు. పైరేటెడ్ సాఫ్ట్ వేర్ ను వినియోగించడం నేరంగా పరిగణిస్తూ లక్ష డాలర్లు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. నెలరోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఇందుకు సంబంధించిన కేసు 2013లో నమోదైంది. ఈ సాఫ్ట్ వేర్ లను ప్రధానంగా వస్త్ర ఉత్పత్తిదారులు, హోల్ సేలర్లు, దిగుమతిదారులు ఎక్కువగా వాడుతుంటారు.