: స్టార్ హోటళ్లు.. పట్టపగలే చూపిస్తున్న చుక్కలు!
కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకునేందుకని వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో స్టార్ హోటళ్లు... కస్టమర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. అధిక ధరలను వసూలు చేస్తున్నాయి. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో తాజ్, ఓబ్ రాయ్, లీలా వంటి లగ్జరీ హోటళ్లకు వచ్చే పర్యాటకుల సంఖ్య అధికంగా ఉండటంతో వాటి డిమాండ్ బాగా పెరిగిపోతోంది. రోజుకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ ధరలే కాకుండా ఈ హోటల్ లో బస చేసే పర్యాటకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో తప్పనిసరిగా పాల్గొనాలని ఆయా హోటళ్లు కండిషన్ పెట్టాయి. అయితే, వాటి ఛార్జీలు ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. హోటల్ స్థాయి మేరకు న్యూఇయర్ ఈవెంట్ కూపన్ల ధర రూ.30 వేల పైమాటే. దీంతో హోటల్ గదుల ఖర్చు, న్యూ ఇయర్ పార్టీల ఖర్చు కలిసి తడిసి మోపెడవుతోంది. ఈ హోటళ్లలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి బస చేయాలంటే ఖర్చు లక్ష రూపాయల పైమాటగానే ఉన్నట్లు సమాచారం.