: మీ ఆర్జనలో నీతి ఉందా? ఆ తృప్తి వేరు!!
'చేతకాని వాడు మాత్రమే నీతి గురించి మాట్లాడుతాడు' అనే డైలాగును మనం సినిమాల్లోనే కాదు.. చుట్టుపక్కల ప్రపంచంలో కూడా చాలాసార్లు వినే ఉంటాం. ప్రపంచం డబ్బు చుట్టూతానే తిరుగుతూ ఉన్నప్పుడు 'ఎలా సంపాదించాం అన్నది కాదన్నయ్యా.. ఎంత సంపాదించాం అన్నదే ముఖ్యం' అని కూడా మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచంలో అనైతికంగా సంపాదించే డబ్బుకు పెద్దగా విలువ ఉండదట. తాజా పరిశోధన కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుండడం విశేషం.
కాలిపోర్నియా, బెర్క్‌లీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో వ్యక్తులు తాము నీతిమంతులుగా ఇమేజి తెచ్చుకోవడానికే ఇష్టపడతారని తేలింది. అలాంటి పేరు వారికి ఎంతో ప్రేరణ ఇస్తుందని తేల్చారు. తమపై వచ్చిన చెడ్డపేరును తుడిచేసుకోవడానికి కొన్ని సంస్థలు న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్తాయని స్టాన్‌ఫర్డ్‌కు చెందిన రాబ్ వేలర్ చెప్పారు. అక్రమంగా డబ్బు సంపాదించే ఎవ్వరు కూడా.. దాన్ని తమ నిజమైన సంపాదనగా లెక్కించడం లేదని ఈ అధ్యయనంలో తేల్చారు. నిజమే.. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ లంచాలు తెగమేసే ఎంతో మంది.. దాన్ని అనుభవించలేకపోతుండడాన్ని మనం చూస్తూనే ఉంటాం కదా!