: ఒంటి గంట వరకే వేడుకలు...దాటితే చర్యలు తప్పవు: నార్త్ జోన్ డీసీపీ
నూతన సంవత్సర వేడుకల పేరుతో హద్దులు మీరితే చర్యలు తప్పవని హైదరాబాదు వాసులకు నార్త్ జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జనవరి 1 తెల్లవారు జాము ఒంటి గంట వరకే నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ఒంటి గంట తరువాత ఎలాంటి వేడుకలకు అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల పేరిట యువతులపై వేధింపులకు పాల్పడినా, వెకిలి చేష్టలు చేసినా, బైక్ రేసింగ్ లకు పాల్పడినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదే సమయంలో ఏ దుకాణదారుడైనా పలు వస్తువులను అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వేడుకలు నిర్వహించే హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు పోలీసుల నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. నూతన సంవత్సర వేడుకల పేరిట బహిరంగ డీజేలు నిషిధ్ధమని ఆయన చెప్పారు.