: నలుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్షను అమలు చేసిన పాక్!
గత ఏడాది పాకిస్థాన్ లోని ఒక సైనిక పాఠశాలపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన నలుగురు ఉగ్రవాదులకు ఈరోజు ఉరిశిక్ష అమలు చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనతో సంబంధమున్న కొందరు ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం ఇప్పటికే ఉరి తీసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ నలుగురు ఉగ్రవాదులకు నేడు ఉరిశిక్ష అమలు చేసింది. కాగా, 2014 డిసెంబర్ 16న పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై తెహ్రిక్ ఈ తోయిబా ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 150 మంది ప్రాణాలు తీశారు. చనిపోయిన వారిలో ఎక్కువ శాతం మంది విద్యార్థులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు 637 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలు చేయగా, మరో 710 మందిని అరెస్టు చేశారు.