: సబ్సిడీలు అసలొద్దు... మోదీ సర్కారుకు ఆర్బీఐ సిఫార్సులు
ఇండియాలో పేదలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ రూపంలో ఖర్చు పెట్టవద్దని, సంక్షేమ పథకాల రూపంలో అందే ప్రతి రూపాయి లబ్ధిదారుడి ఖాతాలోకే జమ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోదీ ప్రభుత్వానికి సూచించింది. నగదు బదిలీలో సంస్కరణలు జరిగితేనే నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, ఎన్నో సంక్షేమ పథకాల్లో ఖజానా సొమ్ము అన్యాక్రాంతమవుతుందని మధ్యంతర ఆర్థిక సమ్మిళితంపై ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ మొహంతీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఆధార్ సంఖ్యను ప్రామాణికంగా తీసుకోవచ్చని కూడా వెల్లడించింది. ఇండియాలో ఆర్థిక స్థిరత్వం, రుణ లభ్యతలో మెరుగైన పనితీరుకు ఈ సిఫార్సుల అమలు తప్పనిసరిని పేర్కొంది. కాగా, ఆర్బీఐ 80వ వార్షికోత్సవాలు జరిగిన సందర్భంగా సబ్సిడీలపై సిఫార్సులు చేయాలని గడచిన జూలైలో ఈ కమిటీ ఏర్పాటు కాగా, సిఫారసులు కేంద్రానికి అందాయి. కమిటీలోని అందరూ ఏకాభిప్రాయంతో సిఫార్సులు చేసినట్టు సమాచారం. స్వల్ప కాలిక రైతు రుణాలపై రూ. 3 లక్షల లోపు బకాయిలుంటే, రెండు శాతం వడ్డీ మాఫీ అమలవుతుండగా, దాన్ని 5 శాతానికి పెంచడం ద్వారా తిరిగి చెల్లింపులను ప్రోత్సహించవచ్చని కమిటీ అభిప్రాయపడింది. నిజమైన రైతులంతా సదరు పొలాలకు యజమానులు కారని, అందువల్లే రుణ రాయితీలు వారికి అందడం లేదని పేర్కొన్న కమిటీ, భూమి యజమానులు తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటూ, వాటిని అప్పుల రూపంలో ఇస్తున్నారని, ఈ విధానం రూపుమాపాలని పేర్కొంది. ఇండియాలో అమలవుతున్న పలు సబ్సిడీ స్కీములను రద్దు చేయాలని సిఫార్సులు చేసింది.