: నందన్ నిలేకనీకి ‘చేయి’స్తున్న కాంగ్రెస్!... పోస్టర్లలో కనిపించని ఐటీ దిగ్గజం ఫొటో
బ్యాంకులో ఖాతా తెరవాలి... ఆధార్ కార్డు లేనిదే పనికాదు. రేషన్ కార్డు కావాలి... ఇక్కడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. సమీప భవిష్యత్తులో ఆధార్ కార్డు లేనిదే, ఏ ఒక్క పని కాదు. ఇదీ ఆధార్ కార్డుకు ఉన్న విలువ. ఇంతటి కీలక కార్డుకు జీవం పోసింది... ఏ రాజకీయ నేతో కాదు. దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకనీ. యూపీఏ ప్రభుత్వం పిలవంగానే బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలేసుకుని నిలేకనీ ఢిల్లీలో వాలిపోయారు. యూఐడీఏఐ పేరిట సంస్థను రూపొందించుకుని ఆధార్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. మెజారిటీ ప్రజలకు కార్డులను చేరవేశారు కూడా. ఈ క్రమంలో నిత్యం రాజకీయ నేతల వెంట తిరిగిన ఆయనకు పాలిటిక్స్ పై మమకారం పెరిగింది. నిలేకనీ మనసులోని మాటను గమనించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆయనకు ఘన స్వాగతం పలికింది. ఉబ్బితబ్బిబ్బైన నిలేకనీ ముందూ, వెనుకా చూసుకోకుండా హస్తం పార్టీలో చేరిపోయారు. తర్వాత దక్షిణ బెంగళూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన నిలేకనీ బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ చేతిలో పరాజయం చవిచూశారు. అయినా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నిలేకనీ అడపాదడపా కనిపిస్తున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు బాగానే విలువ వచ్చింది. దక్షిణ బెంగళూరులో ఏ కార్యక్రమం జరిగినా, అక్కడ కనిపించే కాంగ్రెస్ పార్టీ బేనర్లు, కరపత్రాలపై నిలేకనీ ఫొటో కనిపించేది. నిలేకనీకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాదరణనను వాడుకునేందుకు పార్టీ ఈ ఎత్తుగడ వేసింది. అంతేకాక ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయన ఫొటో ప్రముఖంగానే కనిపించింది. ఇక సమీప భవిష్యత్తులో బెంగళూరులో ఎలాంటి ఎన్నికలు లేవు. అంతే, నిలేకనీతో అవసరం లేదని భావించిన హస్తం పార్టీ ఆయనకు హ్యాండిచ్చేందుకే రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దక్షిణ బెంగళూరు పరిధిలో కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ బేనర్లు, ఫ్లెక్సీల్లో నిలేకని ఫొటో కనిపించడం లేదు. నిలేకనీ ఫొటో ఉండాల్సిన స్థానంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ ఫొటో కనిపిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ వెంకటప్ప కుమారుడైన రాజీవ్ గౌడ, గడచిన లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ బెంగళూరు నుంచి పోటీ చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. నిలేకనీ రంగప్రవేశంతో ఆయన ఆశలపై పార్టీ నీళ్లు చల్లింది. ఎన్నికల్లో నిలేకనీ ఓటమి పాలవడంతో మళ్లీ ఆ స్థానం నుంచి నిలేకనీ కాక, తనను దించాలని రాజీవ్ గౌడ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తనకు కాస్తంత అనుకూలంగా ఉన్న సీఎం సిద్ధరామయ్య వద్ద తన పలుకుబడిని వినియోగించి నిలేకనీ ఫొటోను తొలగించడంలో రాజీవ్ గౌడ సఫలీకృతులయ్యారు. మరి నిలేకనీ పరిస్థితి ఏమిటన్నది కాలమే నిర్ణయించాలి.