: న్యూ ఇయర్ పార్టీకి రెడీయా?... ఈ జాగ్రత్తలు తప్పనిసరి!


మరో 60 గంటల్లో ఓ సంవత్సరం కాలగతిలో కలుస్తుంది. సరికొత్త ఆశలతో 2016కు స్వాగతం పలికే వేళ ఉత్సాహం, ఆనందంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలన్న కోరిక అందరికీ ఉంటుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఆ ఆనందం మిగులుతుంది. ఏటా డిసెంబర్ 31 రాత్రి జరిగే ప్రమాదాలు వందలాది ఇళ్లలో నూతన సంవత్సరపు ఆనందాన్ని లేకుండా చేసి విషాదాన్ని నింపుతున్నాయి. నైట్ పార్టీలకు వెళ్లిన మరెందరినో అసంతృప్తికి గురి చేస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే... * సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే పార్టీ చేసుకుంటే మంచిది. * ఒకవేళ అపార్టుమెంట్లలో ఉంటే, ఇరుగుపొరుగు వారితో కలిసి అదే భవంతి సెల్లార్ లేదా టెర్రస్ మీద కలిస్తే ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. * ఇక బయటకు వెళ్లాలనుకుంటే ఇంటికి సాధ్యమైనంత దగ్గరగా ఉండే ఈవెంట్ చూసుకోవాలి. * ఈవెంట్ ను మేనేజ్ చేస్తున్న కంపెనీ ఏంటి? దాని చరిత్ర ఎలాంటిదన్న విషయాన్ని గమనించాలి. (లేకుంటే అక్కడికి వెళ్లిన తరువాత తీవ్ర నిరాశ ఎదురవుతుంది సుమా. 2014 డిసెంబర్ 31న హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన 50కి పైగా న్యూ ఇయర్ ఈవెంట్లు విఫలమయ్యాయి) * ఇక పార్టీలో మద్యం సేవించడం తప్పనిసరి అనుకుంటే, మిమ్మల్ని సేఫ్ గా ఇంటికి చేర్చగలిగిన ఆ అలవాటు లేని స్నేహితుడు పక్కన ఉండటం కూడా తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. * ఎట్టి పరిస్థితుల్లోను రాత్రి 1:30 గంటలకన్నా ముందుగానే ఇంటికి చేరిపోయేలా ప్లాన్ చేసుకోవాలి. * రాత్రి 3 నుంచి 5 గంటల మధ్య బయటకు వెళ్లనే వద్దు. (అత్యధిక యాక్సిడెంట్లు జరిగేది ఆ సమయంలోనే. మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదాలు జరగొచ్చు) * ఆడవాళ్లు గ్రూప్ గా పార్టీకి వెళ్లాలని భావిస్తే, కనీసం మూడు, నాలుగు వందల మంది పాల్గొనే ఈవెంట్లకు వెళితే మంచిది. * అక్కడ అపరిచితులు ఆఫర్ చేసే పానీయాలను అసలు తాకనే కూడదు. * మీ చేతిలోని డ్రింక్ గ్లాసును కూడా ఎక్కడా విడిచి పెట్టకూడదు. అది కూల్ డ్రింక్ అయినా, హాట్ డ్రింక్ అయినా, పొంచివుండే ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ఈ నిబంధన తప్పనిసరి. ఇక ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే, మీ న్యూ ఇయర్ పార్టీ ఆనందానుభూతులను మిగుల్చుతుంది.

  • Loading...

More Telugu News