: బీహార్ లో ‘జంగిల్ రాజ్’ రీ ఎంట్రీ!... మొన్న ఇద్దరు, నిన్న ఓ యువ ఇంజినీర్ హత్య
బీహార్ నుంచి ‘జంగిల్ రాజ్’ పాలనకు చరమగీతం పాడతానంటూ ఆ రాష్ట్ర అధికార పగ్గాలు చేజిక్కించుకున్న జేడీయూ నేత, మిస్టర్ క్లీన్ నితీశ్ కుమార్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. రాష్ట్రంలో అప్పటిదాకా పేట్రేగిపోయిన గూండాలు, రౌడీ మూకలపై ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలో బీహార్ లో గూండారాజ్ అంతమైందని అంతా భావించారు. నితీశ్ కూడా అదే భావించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన ఆయనను బీహార్ ప్రజలు మళ్లీ సీఎంగా ఎన్నుకున్నారు. మూడో దఫా పాలనా పగ్గాలు చేపట్టిన నితీశ్ కేబినెబ్ లో ఒకే ఒక మార్పు. అదే ఆర్జేడీ చేరిక. మిగతాదంతా సేమ్ టూ సేమ్. అయితే నితీశ్ మూడో టెర్మ్ లో మాత్రం ఆ రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ ఎంట్రీ ఇచ్చిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవల దర్భంగా జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు ఇంజినీర్లను బైకులపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై గళం విప్పిన విపక్షాలు మళ్లీ జంగిల్ రాజ్ వచ్చేసిందని నితీశ్ పై విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో నిన్న ఆయన పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై నితీశ్ సమీక్షించారు. సరిగ్గా అదే సమయంలో మరో యువ ఇంజినీర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. రిలయన్స్ టెలికాంలో ఇంజినీర్ గా పనిచేస్తున్న అంకిత్ ఝా ఆదివారం రాత్రి కంపెనీ వాహనం వచ్చిందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన వైశాలిలో గొంతు కోసిన స్థితిలో దారుణంగా హత్యకు గురయ్యారు. తాజా ఘటనతో నితీశ్ మరింత మేర విమర్శలను ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు.