: దోవల్ కు ఝలక్కిచ్చిన గోపాల సుబ్రహ్మణియన్!... సీబీఐ, ఐబీ అధికారులు కావాలని లేఖ


ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో చోటుచేసుకున్నాయని భావిస్తున్న ఆర్థిక అవకతవకలకు సంబంధించి సమగ్ర విచారణ కోసమంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేశారు. మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియన్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఢిల్లీ కేబినెట్ ఇటీవలే అధికారిక అనుమతి మంజూరు చేసింది. సుబ్రహ్మణియన్ వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏరికోరి జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకున్న అజిత్ దోవల్ కు నిన్న ఆయన ఝలక్ ఇచ్చారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ప్రత్యక్ష ప్రమేయముందని భావిస్తున్న డీడీసీఏ కుంభకోణాన్ని నిగ్గు తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలకు చెందిన అధికారుల్లో కొంత మంది తనకు కావాలని దోవల్ కు సుబ్రహ్మణియన్ లేఖ రాశారు. డీడీసీఏ కుంభకోణంలో అసలు వాస్తవాలను వెలికితీసేందుకు అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు సుబ్రహ్మణియన్ కు ఉంది. దీనినే ప్రస్తావిస్తూ కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలతో పాటు ఢిల్లీ పోలీసు శాఖల నుంచి ఒక్కో సంస్థ నుంచి నలుగురైదురుగు చొప్పున తనకు కేటాయించాలని దోవల్ ను కోరారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ పేరిట గోపాల సుబ్రహ్మణియన్ రాసిన లేఖకు దోవల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News