: పెట్రోలు ధరలు అమాంతం పెంచేసిన సౌదీ
ప్రపంచంలోనే పెట్రోలు అతి తక్కువ ధరకు లభించే దేశాల్లో సౌదీ అరేబియా ఒకటన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ దేశంలో లీటరు పెట్రోలు ధర 0.60 రియాల్ లు (సుమారు 0.24 డాలర్లు - రూ. 15.80). గత కొన్నేళ్లుగా ఆర్థిక లోటుతో సతమతమవుతున్న సౌదీ సర్కారు, పెట్రోలు ధరలను ఏకంగా 50 శాతం పెంచేసింది. దీంతో లీటరు ధర 0.60 రియాల్ ల నుంచి 0.90 రియాల్ లకు పెరిగింది. సౌదీ రాజు సల్మాన్ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెట్రోలుతో పాటు విద్యుత్, మంచినీరు, కిరోసిన్, డీజెల్ తదితరాల ధరలనూ పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. కాగా, పెట్రోలు ధరలు పెరిగాయన్న వార్త వెలువడిన వెంటనే, దేశవ్యాప్తంగా పెట్రోలు బంకులన్నీ మూతపడ్డాయి. తిరిగి కొత్త ధరలు అమలయ్యే మంగళవారం ఉదయమే బంకులు తెరుస్తామని పలు పెట్రోలియం సంస్థలు వెల్లడించాయి.