: ఉచ్చు బిగిస్తున్న లోకాయుక్త... బళ్లారిలో 'గాలి' ఇంట మరోసారి సోదాలు!
బళ్లారి సమీపంలో ఇనుప ఖనిజం గనుల అక్రమ తవ్వకం కేసు నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఈ ఉదయం కర్ణాటక లోకాయుక్త దాడులు చేసింది. ఉదయాన్నే దాదాపు 20 మందికి పైగా అధికారులు ఆయన నివాసం, కార్యాలయంపై ఏకకాలంలో దాడులకు దిగారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. లోకాయుక్త డీఎస్పీ రవిశంకర్ నేతృత్వంలోని బృందం ఆయన ఇంట్లో అణువణువూ గాలిస్తోంది. అక్రమ ఆస్తులను కలిగివున్నాడన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే గాలిపై లోకాయుక్త కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాల కోసమే దాడులు చేసినట్టు సమాచారం.