: రాజ్యసభకు మీసా భారతి?... కూతురుతో పాటు భార్యనూ పంపిస్తున్న లాలూ
మొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, ఆ రాష్ట్ర అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమార్తె మీసా భారతి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే తొలిసారే విజయం సాధించిన ఇద్దరు కుమారుల్లో చిన్నోడు తేజస్వీ యాదవ్ ను డిప్యూటీ సీఎం పీఠం ఎక్కించిన లాలూ, పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ కు ఆరోగ్య శాఖను ఇప్పించుకున్నారు. ఇక కూతురును కూడా రాజకీయాల్లోకి పంపాలని భావిస్తున్న ఆయన ఆమెను ఏకంగా రాజ్యసభకు పంపేందుకు నిర్ణయించుకున్నారు. కూతురు మీసా భారతితో పాటు తన సతీమణి, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని కూడా ఆయన పార్లమెంటు పెద్దల సభకు పంపేందుకు రంగం సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేల బలంతో వారిద్దరినీ లాలూ సులువుగానే రాజ్యసభకు పంపనున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.