: భారత్ పై సైబర్ వార్.. 24 గంటల సెల్ సృష్టించిన హఫీజ్!
వాహనాల్లో బాంబులు పెట్టడం, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఆకస్మిక బాంబు దాడులకు పాల్పడడం, ఆత్మాహుతి దాడులు చేయడం వంటి వాటితో ఉగ్రవాద సంస్థలు మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా, టెర్రరిస్టులు సైబర్ వార్ తో భారత్ పై దాడులకు సిద్ధమవుతున్నారు. భారతదేశంపై సైబర్ యుద్ధానికి జమాత్-ఉద్-దవా చీఫ్, 26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సమాయత్తమయ్యాడు. ఈ నేపథ్యంలో 24 గంటల సైబర్ సెల్ ను సృష్టించినట్లు సమాచారం. పాకిస్తాన్ లోని లాహోర్ లో ఈ నెల 26, 27వ తేదీలలో జరిగిన ఒక సమావేశంలో హఫీజ్ పాల్గొన్నట్లు వార్తలొస్తున్నాయి. భారత్ పై సైబర్ యుద్ధానికి సంబంధించిన పలు విషయాలపై ఆయన చర్చించారని, ఈ సమావేశానికి సయీద్ కుమారుడు కూడా హాజరయ్యాడని తెలుస్తోంది. కాగా, ఇటీవల పాక్ ప్రధాన మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకని మన ప్రధాని నరేంద్ర మోదీ పాక్ వెళ్లిన నేపథ్యంలో, మోదీపై సయీద్ విపరీత విమర్శలు చేసిన విషయం తెలిసిందే.