: అనారోగ్యం పేరిట తప్పించుకోవాలనుకున్న 'కాల్ మనీ' నిందితుడి అరెస్టు!
కాల్ మనీ కేసులో నిందితుడు మాథంశెట్టి శివకుమార్ ఈ కేసు నుంచి బయటపడేందుకు చేస్తున్న యత్నాలు ఫలించటం లేదు. పోలీసులు శివను ఇటీవల అరెస్టు చేశారు. ఈరోజు విజయవాడలో కోర్టు ముందు ఆయన్ని హాజరుపర్చగా రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో శివను జైలుకు తరలిస్తుండగా .. జైలు లోపలికి వెళ్లకుండా తనకు అనారోగ్యంగా ఉందని చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనారోగ్యం పేరుతో ఈ కేసు నుంచి తప్పించుకోవాలని శివ ప్రయత్నిస్తున్నట్లు డీసీపీ కాళిదాసు రంగారావుకు అనుమానం రావడంతో, కొద్ది సేపటి క్రితం ఆసుపత్రి వద్దకు వెళ్లారు. మాధంశెట్టి శివ ఉన్న గదిలోకి ఆయన వెళ్లారు. శివ దర్జాగా, ఆరోగ్యంగా తిరుగుతున్నట్లు ఆయన గమనించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యాధికారులకు ఆయన చెప్పడంతో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. శివకుమార్ కు ఎటువంటి అనారోగ్యం లేదని ఆ వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో శివను పోలీసులు అరెస్టు చేశారు.