: భర్తలను వదిలేస్తున్న కాశ్మీర్ మహిళలు
జమ్ము కాశ్మీర్ లోని కాశ్మీర్ ప్రాంతంలో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. పురుషాధిక్యత ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, అక్కడ ఈ మధ్య సంభవిస్తున్న పరిణామాలు వార్తల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. కట్టుబాట్ల నుంచి బయటకు వస్తున్న మహిళలు తమ భర్తలకు విడాకులు ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారి, తమను చిత్ర హింసలకు గురి చేస్తున్న భర్తలకు విడాకులు ఇచ్చేస్తున్నారు. స్థానిక షరియా కోర్టు సాయంతో ఇప్పటి వరకు 40 మంది మహిళలు విడాకులు ఇచ్చేశారు. విడాకులు పొందిన వారిలో ఒకరైన 27 ఏళ్ల రిఫాత్ మాట్లాడుతూ, భర్త నుంచి విడిపోయేందుకు తన తల్లిదండ్రులను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డానని తెలిపింది. ఓ మహిళ విడాకులు కోరరాదని పురుషులు ఎందుకు భావిస్తారో తనకు అర్థం కావడం లేదని చెప్పింది. పురుషుల్లాగే విడాకులు ఇచ్చే హక్కు మహిళలకు కూడా ఉందని తెలిపింది. సమాజం నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కొంటున్నానని... అయినా, ఎవరి మాటలనూ తాను పట్టించుకోనని... తాను సరైన నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. కాశ్మీర్ మహిళల్లో వస్తున్న ఈ మార్పును కొందరు హర్షిస్తుండగా... చాలా మంది వ్యతిరేకిస్తుండటం గమనార్హం.