: మోదీ, స్మృతి ఇరానీలపై కాంగ్రెస్ నేతల అభ్యంతరకర వ్యాఖ్యలు... భగ్గుమన్న బీజేపీ


కాంగ్రెస్ పార్టీ అసోం శాఖకు చెందిన ఇద్దరు నేతలు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మహిళా నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీని మోదీకి రెండో భార్యగా వారు అభివర్ణించారు. అసోం వ్యవసాయ శాఖ మాజీ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేత నీలమణి సేన్ దెకా నిన్న నల్బరీ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు. స్మృతి ఇరానీ విద్యార్హతలను ప్రశ్నించిన ఆయన, కేంద్ర మహిళా మంత్రి మోదీకి రెండో భార్యగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక అదే రాష్ట్రానికి చెందిన మరో కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పదవి వెలగబెడుతున్న రూప్ జ్యోతి కుర్మి కూడా ఇదే తరహా వ్యాఖ్య చేశారు. దెకా, కుర్మి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతలు సిగ్గుచేటైన వ్యాఖ్యలు చేస్తుంటే, కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మండిపడ్డారు. ఇక అసోం బీజేపీ శాఖ అధ్యక్షుడు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ ఇద్దరు నేతలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ చేశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధాని మోదీపై ఆ తరహా వ్యాఖ్యలు చేసిన వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దెకా, కుర్మిలపై తాము పరువు నష్టం దావా వేస్తామని సోనోవాల్ చెప్పారు. దెకా వ్యాఖ్యలపై ట్విట్టర్ లోనూ విమర్శలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News