: పార్లమెంటుకు కొత్త భవనాన్ని కడదాం!... వెంకయ్య శాఖకు లోక్ సభ స్పీకర్ లేఖ
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిన్న బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు నేతృత్వంలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు ఓ లేఖ రాశారు. పార్లమెంటుకు కొత్త భవనాన్ని నిర్మిద్దామని ప్రతిపాదించిన మహాజన్, తన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎప్పుడో 88 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనానికి కాలం చెల్లిపోయిందని, మరింత కాలం ఇదే భవనంలో కొనసాగడం కాస్త ఇబ్బందేనని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త భవనాన్ని నిర్మిద్దామని ఆమె ప్రతిపాదించారు. 1927లో నాటి అవసరాల మేరకు నిర్మించిన పార్లమెంటు భవనం, ప్రస్తుత అవసరాలకు అంతగా సరిపోయే పరిస్థితి లేదని తెలిపారు. లోక్ సభ స్థానాలు 2026 తర్వాత పెరగనున్నాయని, హెరిటేజ్ గ్రేడ్-1 నిర్మాణంగా ప్రస్తుత భవనాన్ని ప్రకటించినందుకు దానికి మార్పులు చేర్పులు చేయడం కుదరదని పేర్కొన్నారు. అంతేకాక అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరికరాలను ఎంపీలు వినియోగించుకునే విషయంలో ప్రస్తుత భవనంలో ఏర్పాట్లు లేవని తెలిపారు. దీంతో కొత్త భవనం కడితేనే బాగుంటుందని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు భవనం ఆవరణలోనే కొత్త భవనం నిర్మించవచ్చని, అలా కుదరని పక్షంలో రాజ్ పథ్ లోని ప్రభుత్వ స్థలమైనా ఫరవాలేదని కూడా మహాజన్ పేర్కొన్నారు. తన లేఖను పరిశీలించి తగిన రీతిలో చర్యలు చేపట్టాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.