: సౌదీలో చిత్ర హింసలు అనుభవించిన ముగ్గురూ క్షేమంగా తిరిగి వచ్చారు


సౌదీ అరేబియాలోని ఆభా నగరంలో ఇటుకల ఫ్యాక్టరీలో పనిచేస్తూ, యజమాని చేతిలో నానా హింసలు అనుభవించిన ముగ్గురు కేరళ వ్యక్తులు క్షేమంగా స్వదేశం చేరుకున్నారు. తమ యజమాని కర్రతో తమను చితకబాదుతున్న భయానక వీడియోను వారు వారి కుటుంబ సభ్యులకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కేరళలో ప్రకంపనలు సృష్టించింది. అభిషేక్, విమల్, బైజు అనే వ్యక్తులు ఉత్తర కేరళలోని హరిపాద్ టౌన్ కు చెందిన వారు. యెమెన్ లో ఎలక్ట్రీషిన్లుగా ఉద్యోగం అని చెప్పి వీరి ముగ్గురినీ స్థానిక ఏజెంట్ మోసం చేశాడు. వారిని యెమెన్ పంపకుండా, సౌదీకి పంపాడు. అక్కడ వీరు ముగ్గురూ ఇటుకల ఫ్యాక్టరీలో కార్మికులుగా బలవంతంగా పనిచేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే, వీరిపై ఫ్యాక్టరీ యజమాని భౌతిక దాడులకు పాల్పడేవాడు. ఈ ముగ్గురు వ్యక్తులను మోసం చేసిన సదరు ఏజెంట్ పై పోలీసు కేసు నమోదైంది. భారత విదేశాంగ శాఖ చొరవతో వీరు ముగ్గురూ సౌదీలోని నరక కూపం నుంచి బయటపడి, భారత్ చేరుకున్నారు. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో బాధితుడు అభిషేక్ మాట్లాడుతూ, ఎన్నో కలలతో అక్కడకు వెళ్లానని, ఇప్పుడు ఏమి చేయాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పులు తీర్చడానికి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఎక్కడ నుంచి తీసుకు రావాలని ప్రశ్నించాడు. మరోవైపు విమల్ తల్లి మాట్లాడుతూ, తన కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News