: చోటా రాజన్ ను తీహార్ జైల్లోనే లేపేస్తాం!: చోటా షకీల్ సంచలన ప్రకటన


మాఫియా డాన్ చోటా రాజన్ ను మట్టుబెట్టి తీరతామని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడి భుజం చోటా షకీల్ ప్రకటించాడు. నేడు పాక్ లోని కరాచీలో జరగనున్న దావూద్ షష్టి పూర్తి సందర్భాన్ని పురస్కరించుకుని చోటా షకీల్ ‘మెయిల్ టుడే’ ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడాడు. ఈ సందర్భంగా చోటా రాజన్ తో తమకున్న వైరాన్ని మరోమారు అతడు ప్రస్తావించాడు. ఇప్పటికే పలుమార్లు రాజన్ ను అంతమొందించేందుకు యత్నించామని, అయితే ప్రతిసారీ అతడు తృటితో తప్పించుకున్నాడని షకీల్ పేర్కొన్నాడు. బాలిలో ఇండోనేసియా పోలీసుల అదుపులో ఉన్నప్పుడే రాజన్ ను లేపేసేందుకు పక్కా ప్రణాళిక వేశామని, అయితే అందుకు అవసరమైన ఆయుధాలు చేతికందడంలో జాప్యం జరిగిన కారణంగా అతడు తప్పించుకున్నాడని షకీల్ చెప్పాడు. ఈ విషయంలో తాము విఫలం కాలేదని పేర్కొన్న షకీల్, ఎప్పటికైనా చోటా రాజన్ ను మట్టుబెట్టి తీరతామని చెప్పాడు. జైల్లో ఉన్నాను కదా, సురక్షితంగానే ఉన్నానని రాజన్ అనుకుంటే పొరపాటేనన్నాడు. తీహార్ జైల్లోనే అతడిని లేపేస్తామని షకీల్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News