: పొలిటికల్ బాసును రక్షించుకునే పనిలో జంగ్!... గవర్నర్ పై కేజ్రీ ఫైర్
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య డీడీసీఏ వివాదం పెద్ద అగాధాన్నే ఏర్పరచిందని చెప్పాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి డీడీసీఏ అవకతవకల్లో ప్రత్యక్ష ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను కూడా ఏర్పాటు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ కమిషన్ చట్టవిరుద్ధమని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మొన్న కేంద్రానికి ఓ నివేదిక పంపారు. దీనిపై నిన్న కేజ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ గురువులను కాపాడే పనిలో జంగ్ మునిగిపోయారని ఆక్షేపించారు. గవర్నర్ పదవిలో ఉన్న జంగ్ ఈ తరహా చర్యలకు పాల్పడటం తగదని కూడా కేజ్రీ వ్యాఖ్యానించారు. ‘‘జంగ్ పొలిటికల్ బాస్ జైట్లీ. బాసును కాపాడుకునే పనిలో జంగ్ నిమగ్నమయ్యారు’’ అంటూ కేజ్రీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.