: ‘వర్మ’ సినిమా పాట పాడుకుంటూ... అతను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు!
మధ్యప్రదేశ్ కు చెందిన వీరేంద్ర శర్మ అనే వ్యక్తి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి నేర చరిత్ర ఉంది. పలు కేసులు కూడా నమోదై ఉన్నాయి. వీటన్నింటి నుంచి బయటపడటం అసాధ్యమనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదీ కూడా.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా సత్యలోని ‘గోలీ మార్ భేజే మే’ అనే పాట పాడుకుంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీరేంద్ర శర్మ తన భార్యను అన్నం వడ్డించమని చెప్పాడు. వంటగదిలోకి ఆమె వెళ్లిన కొద్ది నిమిషాలకే తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. దీంతో ఆమె వంటగదిలో నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చి చూసేసరికి వీరేంద్ర శర్మ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అతనిపై పలు కేసులు ఉన్న కారణంగానే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ సంఘటనపై దర్శకుడు వర్మ ట్విట్టర్ లో స్పందించారు. 'చాలా బాధకరమైన సంఘటన' అని పేర్కొన్నారు.